స్నానంతో సాంత్వన...
హడావుడిగా... ఐదారు మగ్గులు గుమ్మరించుకుని ఇవతలకు వచ్చేసి స్నానం పూర్తయ్యిందంటే ఎలా! స్నానంతో శరీరానికి సాంత్వన లభించాలి. అందుకే ఆ నీటిలో.. అప్పుడప్పుడు కొన్నిరకాల పదార్థాలు వేసుకోండి. అవేంటో.. వాటివల్ల కలిగే మేలు గురించి తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.
* కప్పు రాక్‌సాల్ట్‌ను స్నానం చేసే నీటికి కలపాలి. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది. అలసటా దూరమవుతుంది.
* రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటున్నారా! బకెెట్ నీటిలో కప్పు పాలపొడి వేయండి. వెన్న తీసిన పాలైనా ఫరవాలేదు. అదీ కుదరకపోతే.. స్నానం చేసేముందు చర్మానికి పచ్చిపాలు రాసుకోండి.
* ఎండకారణంగా కమిలిన చర్మానికి ఏం చేయాలో తెలుసా.. కొద్దిగా కలబంద గుజ్జును బకెట్ నీటికి చేర్చండి. ఈ గుజ్జులోని మాయిశ్చరైజింగ్ సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి కూడా.
* రోజంతా పడిన అలసట.. ఒత్తిడి దూరం కావాలనుకుంటే.. గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది.
* శరీరాన్ని శుభ్రపరచడంతోపాటు.. మృదువుగా.. ప్రకాశవంతంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది కామొమైల్. అందుకే వారానికోసారి పది చుక్కల కామొమైల్ నూనెను నీటిలో వేసుకుని స్నానించండి. పొడిచర్మాన్నీ నివారించిన వారవుతారు. నూనె అందుబాటులో లేకపోతే.. కామొమైల్ టీని చల్లని నీటికి చేర్చి స్నానం చేయండి.
* శరీరం నుంచి దుర్వాసన వస్తోందా. దీనికి సరైన పరిష్కారం యూకలిప్టస్ నూనె. ఇందులోని యాంటీసెప్టిక్ సుగుణాలు.. వాసనను దూరం చేస్తాయి.
* మేనికి మేలుచేయడంతోపాటు.. బ్లెమిషెస్ మచ్చల్ని కొంతవరకు తగ్గించడంలో తోడ్పడతాయి ఓట్స్. కాబట్టి ప్యాక్‌గానే కాకుండా.. అప్పుడప్పుడు ఇలానూ వాడండి.
* తలనొప్పిని దూరం చేయడంతోపాటు.. జుట్టు కుదుళ్లకూ ఆరోగ్యాన్నందిస్తుంది రోజ్‌మేరీ నూనె. నాలుగైదు చుక్కల నూనె నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఫలితం లభిస్తుంది.
* శారీరక, మానసిక సాంత్వన లభించాలంటే.. ఐదారు చుక్కల నిమ్మనూనె కలిపిన నీటితో స్నానం చేయడమే పరిష్కారం. బదులుగా చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలు... నిమ్మరసం కూడా వాడవచ్చు.
* చిన్నచిన్న చర్మసంబంధ సమస్యలు ఇట్టే దూరమవుతాయి గులాబీరేకలతో. ఆలస్యమెందుకు.. గుప్పెడు గులాబీరేకల్ని బకెట్ నీటిలో కలిపి స్నానం చేసి చూడండి. గుబాళింపుతో పాటు.. శరీరానికి మేలు జరుగుతుంది.
* రోజంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు స్నానం చేసే నీటిలో.. కప్పు సిడార్ వెనిగర్ కలిపి చూడండి. ఇంద్రియాలకు సాంత్వననందించడం.. రోజంతా చురుగ్గా ఉంచడం.. లాంటివన్నీ దాని ప్రత్యేకతలు
No comments:
Post a Comment